ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లిం మత పెద్దల డిమాండ్...

సిరిసిల్లటౌన్//మే 28 (ఆకాంక్ష) : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బక్రీద్ పండుగ సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.బక్రీద్ నమాజ్ అనంతరం ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలు, యువకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు.ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. నెమలికి జాతీయ పక్షి హోదా ఉన్నట్లే ఆవుకు జాతీయ జంతు హోదా కల్పించాలని ఆవుల పేరుతో అమాయకులపై దాడులు ఆపాలని ”, “సామరస్యమే దేశ బలం” వంటి నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. దేశంలో గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడులు, సామాజిక విద్వేషాలను అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.అదేవిధంగా బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను బలి ఇవ్వకూడదని ముస్లిం సమాజానికి పిలుపు నిచ్చారు. శాంతి,సామరస్యాలను కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మత పెద్దలు సూచించారు.ఈ సందర్భంగా పలువురు ముస్లిం నాయకులు మాట్లాడుతూ, మతాల మధ్య ఐక్యతను దెబ్బతీసే చర్యలకు తావివ్వకుండా పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని అన్నారు. దేశంలో అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా జీవించాలనే ఉద్దేశంతోనే ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.కాగా, బక్రీద్ ప్రార్థనలు జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రశాంత వాతావరణంలో జరిగాయి. వేలాది మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని దేశ శాంతి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు.