– 30 మందికి గాయాలు, 10 మంది పరిస్థితి విషమం...

అనంతపురం//మే26(ఆకాంక్ష) : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వైపు వెళ్తున్న కేకే ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు 44వ నంబర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు మూడు పల్టీలు కొట్టి రహదారి పక్కనున్న పంట పొలాల్లోకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.