ధాన్యపు బస్తాలకు నిప్పంటించి రైతుల నిరసన

యాదాద్రి//మే26(ఆకాంక్ష)  :యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జిల్లాలోని బొందుగుల గ్రామంలో కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండటం, అధికారులు మరియు మిల్లర్ల నిర్లక్ష్య ధోరణికి నిరసనగా రైతులు ధాన్యపు బస్తాలకు నిప్పంటించి ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులు తెలిపిన వివరాల ప్రకారం, కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఇప్పటికే కోతలు పూర్తయి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించినప్పటికీ తూకం మరియు లిఫ్టింగ్ పనులు ఆలస్యమవుతున్నాయని ఆరోపించారు. మరోవైపు వర్షాలు పడే అవకాశం ఉండటంతో ధాన్యం తడిసి భారీ నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.రోజుల తరబడి కేంద్రాల వద్దే ధాన్యం నిల్వ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలి” అని రైతులు డిమాండ్ చేశారు.సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.