అధికారులు నిధుల లావాదేవీలపై ఆరా తీస్తున్న సమయంలో వెలుగులోకి వచ్చిన వ్యవహారం...

గద్వాల// మే26(ఆకాంక్ష) : కేటిదొడ్డి మండలం పరిధిలోని ఇర్కిచేడు గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భారీ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. పనికి రాని వ్యక్తుల పేర్లపై బిల్లులు లిఫ్ట్‌ చేసి లక్షల రూపాయలు కాజేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో అధికారులు నిధుల లావాదేవీలపై ఆరా తీస్తున్న సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.గ్రామ పంచాయతీ నిధులతో పాటు ఉపాధి హామీ పథకం, హార్టికల్చర్‌ పనుల్లో కూడా అక్రమాలు చోటుచేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత ప్రజాప్రతినిధులు, కొందరు ప్రభుత్వ అధికారులు కలిసి పంచాయతీ ఖజానాకు గండికొట్టినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఉపాధి పనులకు హాజరుకాని వ్యక్తుల పేర్లపై బిల్లులు సృష్టించి నిధులు మళ్లించినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.ఈ వ్యవహారాలన్నింటిపై గ్రామంలోని కొందరు వ్యక్తులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. గ్రామపంచాయతీ నిధులు, ఉపాధి హామీ పథకం, హార్టికల్చర్‌ పనులపై సమగ్ర విచారణ చేపడితే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు.ఈ విషయంపై ఎంపీడీవో రమణరావును వివరణ కోరగా, ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. గ్రామస్తుల నుంచి అధికారిక ఫిర్యాదు అందితే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.