పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్...

ఆసిఫాబాద్//మే20(ఆకాంక్ష) :

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో విధుల నిర్వహణలో నిబంధనలు పాటించని ఓ పంచాయతీ కార్యదర్శిపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. దహేగాం మండలం బిబ్రా గ్రామపంచాయతీ కార్యదర్శి డి.సుమలతను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత వెల్లడించారు.బిబ్రా గ్రామ పంచాయతీలో నిధుల వినియోగంపై సర్పంచ్,ఉపసర్పంచ్‌లు చేసిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక విచారణ చేపట్టారు. ఈ విచారణలో గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా, సర్పంచ్ మరియు ఉపసర్పంచ్‌ల ఆమోదం పొందకుండా రూ.1,02,297 నిధులను నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేసినట్లు తేలింది. అదే విధంగా ఇతర చెల్లింపుల వ్యవహారాల్లో కూడా నిబంధనలు పాటించలేదని విచారణలో వెల్లడైంది.దీంతో విధుల పట్ల నిర్లక్ష్యం, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత లేకపోవడం కారణంగా పంచాయతీ కార్యదర్శి డి.సుమలతను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామ పంచాయతీల్లో నిధుల చెల్లింపులు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, నిబంధనలు అతిక్రమించినా లేదా సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు.