సబ్‌స్టేషన్ సమీపంలో ఉన్న చెత్తకు నిప్పంటించడంతో వ్యాపించిన మంటలు...

నాగర్‌కర్నూల్ టౌన్//మే 20(ఆకాంక్ష) :

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని ఎలక్ట్రిక్ సబ్‌స్టేషన్‌లో బుధవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు సబ్‌స్టేషన్ సమీపంలో ఉన్న చెత్తకు నిప్పంటించడంతో మంటలు వేగంగా వ్యాపించి సబ్‌స్టేషన్ పరిసరాలను ఆవరించాయి. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలను గమనించిన గ్రామస్థులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బిజినపల్లి ఎస్సై శంషాద్దీన్ సిబ్బందితో కలిసి తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో మంటలను పూర్తిగా ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదం మరింత విస్తరించి ఉంటే సబ్‌స్టేషన్‌కు నష్టం వాటిల్లే అవకాశం ఉండేదని స్థానికులు తెలిపారు. సమయానికి స్పందించిన పోలీసులు, సిబ్బంది చర్యలతో ప్రమాదం నుంచి బయటపడ్డామని గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్న పోలీసులు, చెత్తకు నిప్పంటించిన వ్యక్తుల గుర్తింపుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.