తహసీల్ చౌరస్తాలో బీజేపీ నేతల ధర్నా.. పోలీస్ స్టేషన్‌లో బీజేపీ శ్రేణుల ఆందోళన...

జగిత్యాల//మే17(ఆకాంక్ష) :

జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 18న జగిత్యాలలో నిర్వహించనున్న ఎంపీ ధర్మపురి అరవింద్ ధర్మదీక్షకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి స్థలం కేటాయింపు అంశంపై చేపట్టనున్న దీక్షకు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు తహసీల్ చౌరస్తాలో ధర్నా నిర్వహించాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి బోగ శ్రావణి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, ప్రజాస్వామ్య బద్ధమైన నిరసనలకు అనుమతులు నిరాకరించడం సరికాదని నాయకులు ఆరోపించారు.ధర్నా తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు జోక్యం చేసుకుని బోగ శ్రావణితో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో బోగ శ్రావణికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఆమెను పోలీసులు వాహనంలో తరలించే సమయంలో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.పోలీస్ స్టేషన్‌కు తరలించిన అనంతరం కూడా బీజేపీ కార్యకర్తలు అక్కడే ఆందోళన కొనసాగించారు. పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.